Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యాంకర్ సుమను పరుగులు పెట్టించిన రానా!

  • 'జెర్సీ' థాంక్యూ మీట్ లో ఆసక్తికర సన్నివేశం
  • సుమకు రానా పాదాభివందనం
  • కంగారుపడిపోయిన సుమ
నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా వచ్చిన జెర్సీ చిత్రం విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం హైదరాబాద్ లో థాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు రానా కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన సుమకు, రానాకు మధ్య ఆసక్తికర ఘటన జరిగింది.

మైక్ అందుకున్న రానా మాట్లాడుతూ, తనకు క్రికెట్ అన్నా, అమ్మాయిలు, పెళ్లి, పిల్లలు అన్నా పెద్దగా ఆసక్తి ఉండదని తెలిపారు. అలాంటిది జెర్సీ సినిమా చూశాక కంటతడి పెట్టకుండా ఉండలేకపోయానని, ఇక మామూలు ప్రేక్షకుడి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు.

అయితే, సుమ ఎలాంటి పరిస్థితుల్లోనైనా చమత్కరించగల దిట్ట కావడంతో, వెంటనే అందుకుని మీకు త్వరలోనే అమ్మాయిలు, పెళ్లి, పిల్లల గురించి బాగా అర్థం కావాలని కోరుకుంటున్నాం అనగానే రానా చప్పున వచ్చి సుమ కాళ్లకు నమస్కరించే ప్రయత్నం చేశారు. అది చూసి సుమ కంగారుపడిపోయి కాళ్లు వెనక్కి లాగేసుకున్నారు. రానా నుంచి తప్పించుకునేందుకు వేదికపై పరుగులు పెట్టారు.

అనంతరం, సుమ మాట్లాడుతూ, అందరూ పెళ్లి చేసుకుని కష్టపడుతుంటే మీరు మాత్రం సుఖంగా ఉండాలా? అందుకే మీరు కూడా పెళ్లి చేసుకుని పిల్లల్ని కని, అమ్మాయిల మనసు అర్థం చేసుకోవాలి అంటూ రానాను కవ్వించేలా బదులిచ్చారు. ఈ ఎపిసోడ్ కార్యక్రమానికి హాజరైన అందరిలోనూ నవ్వులు పూయించింది.
Rana
Suma
Tollywood

More Telugu News